అందాం, విందాం, ఆనందిద్దాం!

ఆ దారులు

IMG_20180615_204924713

ఆ దారుల వెంట నడుస్తుంటే
నా స్నేహితులు నా వెంట నడుస్తున్నట్టే
గడచిన రోజులలో, ఏళ్ళలో, కలిసి నడిచిన జ్ఞాపకాలు

 

 

 

IMG_20180511_195858242

ఆ దారుల వెంట నడుస్తుంటే
పిల్లల చిన్నతనం చిందులేస్తున్నట్టే
అక్కడ గడిచిన వారి బాల్యం తాలూకు జ్ఞాపకాలు

 

 

 

ఆ దారుల వెంట నడుస్తుంటే IMG_20180708_203522068
ముందు రోజుల కోసం మూట కట్టుకుంటున్నట్లే
ఈ రోజు మేము అక్కడ గడిపే ప్రశాంత సమయాల జ్ఞాపకాలు

 

 

 

Advertisements

983973_10201278466744668_822303091_nచల్లని సాయంత్రం వేళ, రమా, ఉమా, చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడొచ్చాడో, చందమామ, మబ్బుల వెనకాల నుంచీ తొంగి చూస్తున్నాడు.
ఉమ చంద్రుడికేసి చూసింది. సరిగ్గా ఇలాంటిదే ఆ సాయంత్రం కూడా. గుర్తుకొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది. అంతలోనే ఫక్కున నవ్వొచ్చింది. రమకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగాస్నేహితురాలి వైపు చూసింది. ఉమ చిన్నగా నవ్వడం చూసి, ఊపిరి పీల్చుకుంది.
“సంగతేంటో చెప్తాను విను,” అంటూ, ఉమ ఇలా చెప్పింది.
“ఇరవై ఏళ్ళ క్రితం, ఇలానే ఒక రోజు సాయంత్రం, పెరటి మెట్ల మీద కూర్చుని చందమామను చూస్తున్నాను. చందమామను చూడడం నాకు చాలా ఇష్టం. మా పక్క వీధి నుంచి నుంచి మా ఇంటికి వస్తూ, దారిలో చందమామ నా వెంట వస్తున్నాడో లేదో అని చూసుకుంటూనే ఉండే దాన్ని. బస్సులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు బస్సు కిటికీలోంచి చంద్రుడిని చూస్తూనే ఉండే దాన్ని. ఎంత దూరం మాతో అలా రాగలుగుతాడు? అని అనుమానం. చెట్టెక్కితే చందమామ చేతికి అందుతాడని అనుకునే దాన్ని. మేడ మీదకు ఎక్కినప్పుడు అందక పోతే, కొండ మీద ఎక్కితే అందుతాడేమో అనిపించేది. ఎంతో దూరంలో ఉంటాడని తెలిసినా, అందుకోగలనని ఊహించుకోవాలనిపించేది.”
“మరి చందమామ అంటే నీకు అంత ఇష్టమైతే, నువ్వు ఇందాక గుర్తు చేసుకుని భయపడినది దేనికి?” అని అడిగింది రమ.
“చెప్తున్నాను విను.” అంటూ ఉమ ఇంకా ఇలా చెప్పింది, “నా చందమామ సరదాను చాలా ఆట పట్టించే వాడు మా అన్నయ్య. ‘పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడితో పాటు తిరుగుతుంది. చెల్లాయేమో చంద్రుడితో!’ అనే వాడు.”
“నిజమేలా ఉంది మరి!” అంది రమ, నవ్వుతూ.
ఉమ కూడా నవ్వేసి కథ కొనసాగించింది, “కాసేపయ్యాక బావి దగ్గరికెళ్ళి బావి లోకి తొంగి చూస్తున్నాను. బావి నీళ్ళలో చందమామ తేలి ఆడుకుంటున్నట్టు ఊహించుకుంటున్నాను. ఇంతలో పెద్ద శబ్దం వినిపించింది! గుండె ఝల్లు మంది. గిరుక్కున పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే, అప్పటి వరకూ అక్కడ పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మా అన్నయ్య కనిపించ లేదు! పుస్తకం కింద పడి ఉంది. కుర్చీ కూడా తల్ల కిందులుగా ఉంది. మా అమ్మా, నాన్న, బయటికి ఏదో పని మీద వెళ్ళారు. ఇంకా చాలా సేపటి దాకా రారు. మా అన్నయ్యని పిలుస్తూ, ఇల్లంతా తిరిగి చూశాను. ఇంక పక్క వాళ్ళని పిలుద్దామనుకునేంతలో, కిటికీలోంచి చందమామ కనిపిస్తుంటే, అప్రయత్నంగా అటు వైపు చూశాను. కిటికీ పక్కన ఉన్న అద్దంలో మా అన్నయ్య ప్రతిబింబం కనిపించింది. బట్టలు పెట్టుకునే గూటికి కట్టి ఉన్న తెర వెనక దాక్కుని, తొంగి చూస్తూ అద్దంలో కనిపించి నాకు దొరికిపోయాడు.” అని ఒక క్షణం ఆగింది.
“అంతేనా?” అంది రమ.
“ఇంకా ఉంది, చెప్తాను, విను”, మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది, ఉమ.
“అన్నను పట్టి ఇచ్చిన చందమామకు కృతజ్ఞతలు చెప్పుకుని పెరట్లోకి వెళ్ళాను, ఇంకా, అన్నయ్యను గట్టిగా పిలుస్తూనే. పెరట్లో అన్న పడేసి శబ్దం చేసిన పెద్ద బండ రాయొకటి కనిపించింది. ఆ రాయిని దొర్లించుకుంటూ బావి దగ్గరకు తీసుకెళ్ళి ఎత్తి నీళ్ళలో పడేశాను, ‘అన్నయ్యా!’ అని గట్టిగా అరుస్తూ. మా అన్నయ్య ఒక్క ఉదుటున పరిగెత్తుకుని వచ్చి చూశాడు…నాకు నవ్వాగలేదు”, అని అంటుంటే, రమ నవ్వడం మొదలు పెట్టింది.
“చందమామ సాయం చేశాడు కాబట్టి దొరికిపోయాను, లేకపోతేనా….” అంటూ వెనకాలనుంచి చిన్నగా ఎవరో గొణుక్కోవడం వినిపించింది.
మబ్బు తొలగిపోయి చందమామ కూడా మనసారా నవ్వాడు.
(Courtesy Chandamama)

రంగడు మంచి పిల్లాడు. చదువులోనూ ముందుంటాడు. ఐతే అందరి పిల్లలలాగే అల్లరి కూడా చేస్తుంటాడూ. పని మీద శ్రద్ధ తక్కువ.

ప్రొద్దున లేచినప్పట్నుంచీ రాత్రి పడుకునే దాకా ఏదో ఒక విషయంలో రంగడిని కసురుకుంటూనే ఉంటుంది తల్లి కనకమ్మ. “అలాగేనా కూర్చోవడం?”, “చొక్కా గుండీలు చూడు ఎలా ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావో?” “అలా మెతుకు మెతుకూ ఏరుకు తింటే ఎప్పటికయ్యేను?”, “పుస్తకాలు వెనక్కి మడిచి పట్టుకుంటే పాడైపోతాయి!”, “ఇంత పొద్దు పోయింది. ఇంకా పడుకోకుండా ఆ ఆటలేంటి?” ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.

రంగడికి తల్లి తనని కసురుకోవడం ఎంతగా అలవాటైపోయిందంటే ఆమె మాటలు వినిపించుకోవడం మానేశాడు. దాంతో కనకమ్మ గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చేది. రంగడి చేత చిన్న పని చేయించడానికి కూడా ఎంతో కష్టపడుతున్నట్లు అనిపించేది కనకమ్మకి.

ఒక రోజు సాయంత్రం కనకమ్మ మొక్కలకు నీళ్ళు పెడుతోంది. పూల మొక్కలన్నీ చక్కగా విచ్చుకున్నాయి. జామ చెట్టు పూతకొచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఈ ఇంట్లో క్రొత్తగా దిగినప్పుడు పెరడంతా బోసిగా ఉండేది. పెరట్లో చేరిన చెత్తా చెదారం తీసేసి చక్కగా బాగు చేసి రక రకాల మొక్కలు తెచ్చి నాటింది కనకమ్మ. వాటన్నిటికీ పాదులు చేసి శ్రద్ధగా నీరు పెట్టేది.

ఒక రోజు చిన్ని రంగడు జామ చెట్టుకు అదే పనిగా నీరు పెట్టిన సంగతి గుర్తుకొచ్చి కనకమ్మకు నవ్వొచ్చింది. “రోజూ కొన్ని కొన్ని నీళ్ళు పోసే బదులు ఒకే రోజు బోలెడు నీళ్ళు పోస్తే బోలెడంత ఎదిగిపోతుంది కదా! అప్పుడూ ఎంచక్కా మనం రేపే కాయలు కోసుకుని తినచ్చు!” అని ముద్దు ముద్దు మాటలతో తనతో అనడం గుర్తు చేసుకుంది. “చిన్నతనం!” అని మురిపెంగా మనసులో నవ్వుకుంది.

అంతలోనే ఆమెకు ఇంకో ఆలోచన వచ్చింది. తను ఇప్పుడూ చేస్తున్నదీ అదే కదా. “ప్రొద్దుట్నుంచీ రాత్రి దాకా కసురుకుని ఒక్క రోజులో రంగడి ప్రవర్తన పెద్దరికంగా మార్చెయ్యాలనుకుంటే ఎలాగా?”

ఆ రోజు నుంచీ కనకమ్మ కసురుకోవడం మానేసింది. మెల్లగా గుర్తు చెయ్యడం మాత్రమే చేసేది. ముందు కొన్ని రోజులు రంగడు మెత్తగా చెప్పినప్పుడు వినకుండా మొరాయించేవాడు. అలవాటు కొద్దీ అరవబోయి తమాయించుకునేది కనకమ్మ. రంగడు కొద్ది సేపయ్యాక పొరపాటు గ్రహించుకుని సరిదిద్దుకునే వాడు. క్రమంగా కనకమ్మ గుర్తు చెయ్యాల్సిన అవసరం లేకుండానే పనులు శ్రద్ధగా చేసుకోవడం నేర్చుకున్నాడు.

ఒకరోజు రంగడు జామ చెట్టెక్కి మగ్గిన పళ్ళు కోసుకొచ్చాడు. “అమ్మా, గుర్తుందా, నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు వెంటనే పెద్దదైపోవాలని జామచెట్టుకి అదే పనిగా నీళ్ళు పోసేవాడిని?” అన్నాడు.

సమాధానంగా కనకమ్మ చిన్నగా నవ్వి రంగడిని దగ్గరకు తీసుకుంది.

బాలయ్య పని మీద హడావిడిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ అడవి ఎంత తొందరగా దాటితే అంత మంచిదని పరిగెత్తినట్టే నడుస్తున్నాడు. ఉన్నట్టుండి మంత్రం వేసినట్టు ఆగిపోయాడు. భయపడినంతా అయ్యింది. చింత చెట్టు మీద దెయ్యం, చెట్టు కొమ్మలకి కోతి కొమ్మచ్చి ఆడుతోంది. బాలయ్యకి అడుగు ముందుకి పడట్లేదు, నోట మాట రావట్లేదు. ఎలా కనిపించిందో అలాగే మాయమయ్యింది దెయ్యం. క్షణం ఆలస్యం చెయ్యకుండా, వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు బాలయ్య. అడవి దాటే వరకూ ఆ పరుగాగలేదు.

అడవి దాటాక అక్కడ ఉన్న ఒక బండ రాయి మీద కూర్చుని ఊపిరి తీసుకున్నాడు. భుజం మీది తువాలు తీసుకుని చెమట తుడుచుకుని కళ్ళు తిరు గుతున్నట్లనిపిస్తే కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూసే సరికి మళ్ళీ చింత చెట్టు దగ్గర ఉన్నాడు. బాలయ్యకి ఏమీ అర్థం కాలేదు.

“తెలివి వచ్చినట్లుందే,” అని ఎవరో అనడంతో అటు తిరిగి చూశాడు.

ఆ మాటలన్న ముసలి అవ్వ బాలయ్య దగ్గరికొచ్చి, “ఏం నాయనా, అలిసి పోయినట్టున్నావు. ఆకలితో కూడా ఉండి ఉంటావు. కళ్ళు తిరిగి పడిపోయినట్లున్నావు. ఇటుగా వస్తూ నేను చూశాను కాబట్టి సరిపోయింది. నీళ్ళు తెచ్చి చిలకరిద్దామని చెరువు వైపు వెళ్తున్నాను ఇంతలో నీకు స్పృహ వచ్చింది. అదిగో ఆ చెట్టు పక్కనే నా గుడిసె ఉంది. వచ్చి నాలుగు మెతుకులు తిన్నావంటే ప్రాణం లేచొస్తుంది,” అంటూ తన గుడిసె వైపు నడిచింది. బాలయ్య ఆమెను అనుసరించాడు.

ఆకులో అన్నం వడ్డించి ముసలమ్మ పక్కన కూర్చుంది. “ఏం నాయనా, మీది ఏ వూరు? ఎటు వెళ్తున్నావేం? వెంట ఏమీ తెచ్చుకున్నట్టు లేవు?” అని అడిగింది అవ్వ. అప్పుడు గుర్తుకు వచ్చింది బాలయ్యకు, తన సంచీ తనతో లేదని. జరిగిందంతా అవ్వకి చెప్పాడు.

“దయ్యం లేదు, గియ్యం లేదు, శోష వచ్చి భ్రమపడి ఉంటావు. నీ సంచీ కాస్తా ఏ దొంగలో కాజేసి ఉంటారు,” అంది అవ్వ.

“ఈ రాత్రికి ఇక్కడే పడుకో నాయనా. తెల్లారి నీ పని మీద వెళ్దువు గాని,” అని, బాలయ్యకు బయట ఉన్న నులక మంచం చూపించింది అవ్వ. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు బాలయ్య.

ఎండ చుర్రుమని పొడిచే సరికి లేచి కూర్చున్నాడు. చూస్తే అడవి బయట బండరాయి మీద ఉన్నాడు. భుజానికి ఉన్న సంచీ అలాగే ఉంది. అందులో తను తెచ్చుకున్న సరుకులూ, డబ్బులూ అలానే ఉన్నాయి. “బడలికతో నిద్రలోకి జారుకుని కల కని ఉంటాను,” అనుకుని లేచి నిలబడి బట్టలు దులుపుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. తనకి కావలిసిన పని ముగించుకుని సాయంత్రం అవుతోందనగా తిరుగు దారి పట్టాడు.

దారిలో అతనికి దానయ్య అనే అతను కనిపించాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ అడవిలోకి వచ్చారు. బాలయ్య తనకు వచ్చిన కల సంగతి చెప్పాడు. అప్పుడు దానయ్య తనకు జరిగిన అనుభవం ఇలా చెప్పాడు.

మొన్నటి రోజు దానయ్య ఈ అడవిలోనే అదే చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. చెట్టు మీద ఎవరో నవ్వడం వినిపించి చూస్తే అక్కడ ఒక దయ్యం తనను చూసి నవ్వుతోంది. దెయ్యాన్ని చూసిన భయంలో దానయ్య కాళ్ళూ చేతులూ వణక సాగాయి. ఇంతలోనే ఆ దయ్యాం కాస్త మాయమయ్యింది. అదే అదను అని లేచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసి అడవిబయటకి చేరుకున్న దానయ్య శోష వచ్చి పడిపోయాడు. మెళుకువ వచ్చేసరికి చింత చెట్టు కిందే ఉన్నాడు. ముసలి అవ్వ కనిపించడం, బువ్వ తినిపించడం, మళ్ళీ పడుకుని లేచే సరికి అడవి బయట ఉండడం, అచ్చంగా బాలయ్యకు జరిగినట్టే జరిగాయి. అతనూ కల అనుకుని వదిలేశాడు.

ఇద్దరూ తమకి జరిగినవి నిజమైన అనుభవాలే అనీ, కల కాదనీ తెలుసుకున్నారు. చింత చెట్టు దయ్యం తమని ఆట పట్టించిందని తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఒక పథకం వేసుకున్నారు. చింత చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు కింద తువ్వాలు పరుచుకుని కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. “ఆ మాంత్రికుడు బలే మంత్రం చెప్పాడు కదా?” అన్నాడు బాలయ్య. దానికి దానయ్య, “అవును ఈ సారి దయ్యం కనిపించగానే ప్రయోగిద్దాము,” అన్నాడు దానయ్య. “ఆ మంత్రం గానీ ప్రయోగించామా, ఇక ఆ దయ్యం మనం చెప్పినట్లు వినాల్సిందే” అన్నాడు బాలయ్య.

వాళ్ళ మాటలు విన్న దయ్యం నిజంగానే వాళ్ళకు ఏదో మంత్రం తెలుసనుకున్నది. “మరి దయ్యం కనిపించకపోతేనో?” అని అంతలోనే అనుమానం వెలిబుచ్చాడు బాలయ్య. “ఏముందీ, ఆకర్షణ మంత్రం వేస్తే అదే పరిగెత్తుకు వస్తుంది,” అన్నాడు దానయ్య.

దయ్యానికి ఇక భయం మొదలయ్యింది. వెంటనే చెట్టు దిగి వచ్చి వాళ్ళని ఏడిపించినందుకు గానూ బాలయ్యనూ, దానయ్యనూ క్షమించమని వేడుకుని వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాననీ, తన మీద ఏ మంత్రమూ ప్రయోగించవద్దనీ వేడుకుంది. ఐతే అది ఇంక ఎప్పుడూ మనుషులకు కనిపించ కూడదనీ, ఎవ్వరి మీదా ఏ మాయలూ చెయ్యరాదనీ, ఒక వేళ అలా చేసినట్టు తెలిస్తే ఆకర్షణ మంత్రం వేసి రప్పించి బంధిస్తామనీ బెదిరించారు దానయ్యా, బాలయ్య. దయ్యం అలాగే అని ఒప్పుకుంది. ఆ తర్వాత అది ఎప్పుడూ ఇంకెవ్వరికీ కనిపించలేదు. ఆ తర్వాత ఎప్పుడూ, ఎవ్వరికీ ఆ అడవి గుండా వెళ్ళినప్పుడు విచిత్రమైన కలలు రాలేదు.

ఊళ్ళోకి వెళ్ళాక తాము దయ్యాన్ని ఎలా హడల గొట్టిందీ గొప్పగా చెప్పుకున్నారు బాలయ్య, దానయ్యా. కానీ వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు? ఆ పైన ఆ దయ్యం ఎవరికైనా కనిపిస్తే కదా?

రాము వాళ్ళ మామయ్య సుందరం ఊరినుంచి వస్తున్నాడంటే రాముతోపాటు అతని స్నేహితులందరికీ కూడా సంబరంగా ఉంటుంది. ఎందుకంటే సుందరం పిల్లలందరితో ఎంతో సరదాగా కాలక్షేపం చేస్తుంటాడు. కథలు చెప్తుంటాడు. సరదా పోటీలు పెడ్తుంటాడు. తను ఊళ్ళు తిరిగి చూసిన వింతలు, విశేషాలు చెప్తుంటాడు.

ఒకసారి అతను రాము వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక కథ చెప్పాడు. “ఇది చీకట్లో పారిపోయే దయ్యం కథ!” అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.

“నాకు చిన్నప్పుడు చీకటంటే చాలా భయం వేసేది. అప్పుడు మా అమ్మా నాలాగే చీకటంటే భయపడే దయ్యం గురించి చెప్పింది. ఆ దయ్యాన్ని మా అమ్మ చూసిందిట కూడా!” అని చెప్పి ఆగాడు సుందరం మామయ్య.

పిల్లలందరూ చప్పుడు చెయ్యకుండా చెవులు రిక్కించి వింటున్నారని గ్రహించి ఇంకా చెప్పసాగాడు.

“మా అమ్మకి అప్పుడు పదేళ్ళుట. అదేమో ఎండాకాలమట. ఒక రోజు ప్రొద్దున మా అమ్మమ్మ తనని కొట్టుకి వెళ్ళి ఏదో కొనుక్కు రమ్మని పంపారుట. అప్పటికే బాగా ఎండెక్కి ఉందిట. మా అమ్మేమో కులాసాగా  చేతిలో ఉన్న డబ్బులు ఆడించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నదల్లా గబుక్కున ఆగిపోయిందట. తను ముందుకి వెళ్తుంటే ఆ ఆకారం కూడా ముందుకి కదుల్తోందిట.”

“అప్పుడిక మా అమ్మ పరిగెత్తడం మొదలుపెట్టిందట. ఆ ఆకారం కూడా పరిగెడ్తున్నట్టే ముందుకి కదిలిందట. ఎలాగో మా అమ్మ కొట్టుకి చేరి కావలసిన సామాన్లు కొనుక్కుని వెనక్కి తిరిగే సరికి ఇంతవరకూ తన ముందున్న ఆకారం కనిపించలేదట. “అమ్మయ్య!” అని ఊపిరి పీల్చుకుని మా అమ్మ నిదానంగా నడుచుకుంటూ ఇంటికి చేరిందట. తీరా ఇల్లు చేరి లోపలికి వెళ్ళేలోపల వెనకనించి తన స్నేహితురాలు పిలిస్తే అటువైపు తిరిగిందట. అప్పుడు ఆ ఆకారం మళ్ళీ కనిపించిందట.  ఆ రోజు రాత్రి మా అమ్మమ్మ వెలిగించిన కొవ్వొత్తి పట్తుకుని వెనక నిలబడితే మా అమ్మ ఆ వెలుగులో పెరట్లోంచి ఏదో తీసుకు రాబోయిందట. కొవ్వొత్తి వెలుగులో మళ్ళీ ఆ ఆకారం తన ముందు కనిపించిందట. మా అమ్మ ఏదో అనబోయేంతలో గాలికి కొవ్వొత్తి ఆరిపోయిందట. మరుక్షణమే ఆ ఆకారం మాయమయ్యిందట,” అని కథ చెప్పడం ఆపి నవ్వుతూ పిల్లలవైపు చూశాడు.

కుతూహలంతో “ఆ తర్వాత ఏమైంది?” అని అడిగారు పిల్లలు.

“ఏమో మరి. మా అమ్మ నాకు ఇంతవరకే చెప్పింది. ఆ తర్వాత నన్నొక పొడుపు కథ అడిగింది. దానికి జవాబు చెప్తే కథలో ఏమైందో కూడా తెలుస్తుందని చెప్పింది. మీరేమైనా ఆ పొడుపు కథ విప్పగలరేమో ప్రయత్నించండి,” అని ఆ పొడుపు కథ చెప్పాడు సుందరం మామయ్య,”పొంచి ఉన్న దయ్యం, పోయిన చోట ప్రత్యక్షం. ఏమిటది?”

పిల్లలందరూ గుసగుసలాడుకున్నారు. అందరూ కలిసి, “అది దయ్యం కాదు మామయ్యా, నీడ! వెలుగు ఎటువైపునుంచి వస్తుంటే దానికి వ్యతిరేక దిశలో నీడ పడుతుంది. చీకటిలో అసలు నీడే ఏర్పడదు, కదా?” అని అడిగారు.

“బలే పసిగట్టేశారే!’ అని మామయ్య అభినందిస్తుంటే పిల్లలు మాత్రం, “మాకు దయ్యం కథ చెప్తానన్నావు. అంతా ఉత్తిదే. ఇప్పుడు నిజంగా దయ్యం కథ చెప్పాల్సిందే” అని పట్టుబట్టారు. “దయ్యాలంటే నాకు భయం!” అంటూ సుందరం మామయ్య అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. 

 

paapaayiBantiఅన్న చేతిలో ఒక బంతి ఉంది,
జారి పాప దగ్గర పడింది.

పాపాయి బంతిని నెట్టింది,
నాన్న వద్ద అది ఆగింది.

పాపాయి పాకుతూ వెళ్ళింది,
పాప చెయ్యి తగిలి బంతి దొర్లింది.

బంతి అమ్మను చేరింది
పాపాయి కిల కిలా నవ్వింది.

అది ఒక నదీ ప్రవాహం!

ఎత్తైన చోటినుంచి ఉత్సాహంతో దూకిన జలపాతం

వడిగా సాగుతూ, వంపులు తిరుగుతూ

సముద్రంలో తనని వంపేసుకుటుంది

అది ఒక నదీ ప్రవాహం!

వరదై ఉప్పొంగుతుంది

ఉధృతాన్ని ప్రదర్శిస్తుంది

గట్టు దాటుతుంది, కట్టలు తెంచుకుంటుంది

అది ఒక నదీ ప్రవాహం!

అలల తాకిడితో రాళ్ళని అరగదీస్తుంది

అన్నాన్ని పండిస్తుంది, ఆకలి తీరుస్తుంది

అలసిన వారిని ఒడ్డున సేదదీరమంటుంది

అది ఒక నదీ ప్రవాహం!

నీటి చుక్కై పుడుతుంది

నిండైన కడలిని చేరుకుంటుంది

చినుకై ఆ కడలి తిరిగి నదిలోకే చేరుతుంది!

Tag Cloud