అందాం, విందాం, ఆనందిద్దాం!

“ఆకాశం భూమి మీదా?”, అనుకుంటూ అడుగు వేశాను

చేరిన వాన నీటిలో చెదిరింది ప్రతిబింబం.

నన్ను చూసి చిలిపిగా నవ్వింది ఆకాశం

వాన కురిసి వెలిసింది, మనసు తడిసి మురిసింది 🙂

ఆ దారులు

IMG_20180615_204924713

ఆ దారుల వెంట నడుస్తుంటే
నా స్నేహితులు నా వెంట నడుస్తున్నట్టే
గడచిన రోజులలో, ఏళ్ళలో, కలిసి నడిచిన జ్ఞాపకాలు

 

 

 

IMG_20180511_195858242

ఆ దారుల వెంట నడుస్తుంటే
పిల్లల చిన్నతనం చిందులేస్తున్నట్టే
అక్కడ గడిచిన వారి బాల్యం తాలూకు జ్ఞాపకాలు

 

 

 

ఆ దారుల వెంట నడుస్తుంటే IMG_20180708_203522068
ముందు రోజుల కోసం మూట కట్టుకుంటున్నట్లే
ఈ రోజు మేము అక్కడ గడిపే ప్రశాంత సమయాల జ్ఞాపకాలు

 

 

 

983973_10201278466744668_822303091_nచల్లని సాయంత్రం వేళ, రమా, ఉమా, చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడొచ్చాడో, చందమామ, మబ్బుల వెనకాల నుంచీ తొంగి చూస్తున్నాడు.
ఉమ చంద్రుడికేసి చూసింది. సరిగ్గా ఇలాంటిదే ఆ సాయంత్రం కూడా. గుర్తుకొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది. అంతలోనే ఫక్కున నవ్వొచ్చింది. రమకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగాస్నేహితురాలి వైపు చూసింది. ఉమ చిన్నగా నవ్వడం చూసి, ఊపిరి పీల్చుకుంది.
“సంగతేంటో చెప్తాను విను,” అంటూ, ఉమ ఇలా చెప్పింది.
“ఇరవై ఏళ్ళ క్రితం, ఇలానే ఒక రోజు సాయంత్రం, పెరటి మెట్ల మీద కూర్చుని చందమామను చూస్తున్నాను. చందమామను చూడడం నాకు చాలా ఇష్టం. మా పక్క వీధి నుంచి నుంచి మా ఇంటికి వస్తూ, దారిలో చందమామ నా వెంట వస్తున్నాడో లేదో అని చూసుకుంటూనే ఉండే దాన్ని. బస్సులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు బస్సు కిటికీలోంచి చంద్రుడిని చూస్తూనే ఉండే దాన్ని. ఎంత దూరం మాతో అలా రాగలుగుతాడు? అని అనుమానం. చెట్టెక్కితే చందమామ చేతికి అందుతాడని అనుకునే దాన్ని. మేడ మీదకు ఎక్కినప్పుడు అందక పోతే, కొండ మీద ఎక్కితే అందుతాడేమో అనిపించేది. ఎంతో దూరంలో ఉంటాడని తెలిసినా, అందుకోగలనని ఊహించుకోవాలనిపించేది.”
“మరి చందమామ అంటే నీకు అంత ఇష్టమైతే, నువ్వు ఇందాక గుర్తు చేసుకుని భయపడినది దేనికి?” అని అడిగింది రమ.
“చెప్తున్నాను విను.” అంటూ ఉమ ఇంకా ఇలా చెప్పింది, “నా చందమామ సరదాను చాలా ఆట పట్టించే వాడు మా అన్నయ్య. ‘పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడితో పాటు తిరుగుతుంది. చెల్లాయేమో చంద్రుడితో!’ అనే వాడు.”
“నిజమేలా ఉంది మరి!” అంది రమ, నవ్వుతూ.
ఉమ కూడా నవ్వేసి కథ కొనసాగించింది, “కాసేపయ్యాక బావి దగ్గరికెళ్ళి బావి లోకి తొంగి చూస్తున్నాను. బావి నీళ్ళలో చందమామ తేలి ఆడుకుంటున్నట్టు ఊహించుకుంటున్నాను. ఇంతలో పెద్ద శబ్దం వినిపించింది! గుండె ఝల్లు మంది. గిరుక్కున పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే, అప్పటి వరకూ అక్కడ పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మా అన్నయ్య కనిపించ లేదు! పుస్తకం కింద పడి ఉంది. కుర్చీ కూడా తల్ల కిందులుగా ఉంది. మా అమ్మా, నాన్న, బయటికి ఏదో పని మీద వెళ్ళారు. ఇంకా చాలా సేపటి దాకా రారు. మా అన్నయ్యని పిలుస్తూ, ఇల్లంతా తిరిగి చూశాను. ఇంక పక్క వాళ్ళని పిలుద్దామనుకునేంతలో, కిటికీలోంచి చందమామ కనిపిస్తుంటే, అప్రయత్నంగా అటు వైపు చూశాను. కిటికీ పక్కన ఉన్న అద్దంలో మా అన్నయ్య ప్రతిబింబం కనిపించింది. బట్టలు పెట్టుకునే గూటికి కట్టి ఉన్న తెర వెనక దాక్కుని, తొంగి చూస్తూ అద్దంలో కనిపించి నాకు దొరికిపోయాడు.” అని ఒక క్షణం ఆగింది.
“అంతేనా?” అంది రమ.
“ఇంకా ఉంది, చెప్తాను, విను”, మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది, ఉమ.
“అన్నను పట్టి ఇచ్చిన చందమామకు కృతజ్ఞతలు చెప్పుకుని పెరట్లోకి వెళ్ళాను, ఇంకా, అన్నయ్యను గట్టిగా పిలుస్తూనే. పెరట్లో అన్న పడేసి శబ్దం చేసిన పెద్ద బండ రాయొకటి కనిపించింది. ఆ రాయిని దొర్లించుకుంటూ బావి దగ్గరకు తీసుకెళ్ళి ఎత్తి నీళ్ళలో పడేశాను, ‘అన్నయ్యా!’ అని గట్టిగా అరుస్తూ. మా అన్నయ్య ఒక్క ఉదుటున పరిగెత్తుకుని వచ్చి చూశాడు…నాకు నవ్వాగలేదు”, అని అంటుంటే, రమ నవ్వడం మొదలు పెట్టింది.
“చందమామ సాయం చేశాడు కాబట్టి దొరికిపోయాను, లేకపోతేనా….” అంటూ వెనకాలనుంచి చిన్నగా ఎవరో గొణుక్కోవడం వినిపించింది.
మబ్బు తొలగిపోయి చందమామ కూడా మనసారా నవ్వాడు.
(Courtesy Chandamama)